ఎన్నికల ఫలితాల ట్రెండ్ పై సీఎం చంద్రబాబు స్పందన

  • ప్రధాని మోదీ నాయకత్వంపై ప్రజలకున్న విశ్వాసమే ఎన్డీయే విజయం అన్న చంద్రబాబు
  • వికసిత భారత్ లక్ష్య సాధనకు ఈ ఫలితం మరింత బలాన్నిచ్చిందని వెల్లడి
  • సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ స్ఫూర్తితో ఎన్డీయే ముందుకు సాగుతోందంటూ ప్రకటన
  • యువత విశ్వసనీయత, అభివృద్ధిని కోరుకుంటున్నారని ఈ తీర్పు చాటిందని స్పష్టీకరణ 
  • ప్రధాని మోదీ, అమిత్ షా, ఎన్డీయే నేతలకు చంద్రబాబు అభినందనలు
అసోం, బెంగాల్ రాష్ట్రాల్లో ఎన్డీయే కూటమి సాధించిన చారిత్రక విజయం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంపై ప్రజలకున్న అచంచల విశ్వాసానికి, ఆయన దార్శనికతకు అద్దం పడుతోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఈ విజయం ‘వికసిత భారత్’ లక్ష్య సాధన ప్రయాణానికి మరింత బలాన్ని చేకూర్చిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.

‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్’ అనే స్ఫూర్తితో దేశ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఎన్డీయే ప్రభుత్వం పనిచేస్తోందని, ఈ ఎన్నికల ఫలితాలు ఆ విషయాన్ని మరోసారి స్పష్టం చేశాయని చంద్రబాబు పేర్కొన్నారు. అభివృద్ధి పట్ల ఎన్డీయేకు ఉన్న తిరుగులేని నిబద్ధతకు ప్రజలు తమ మద్దతును స్పష్టంగా తెలియజేశారని వ్యాఖ్యానించారు. దేశాన్ని ఓ అభివృద్ధి చెందిన శక్తిగా మార్చాలనే సంకల్పానికి ఈ తీర్పుతో మరింత ఊపు వచ్చిందని ఆయన తెలిపారు. ఈ విజయం యావత్ దేశ ప్రజల విజయమని ఆయన కొనియాడారు.

ఈ ఫలితాలు దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకు ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇచ్చాయని చంద్రబాబు అన్నారు. నేటి యువభారతం విశ్వసనీయత, అభివృద్ధి, పౌరులతో నిజాయతీపూర్వకమైన సంబంధాలకే అధిక ప్రాధాన్యత ఇస్తుందనే వాస్తవాన్ని ఈ తీర్పు చాటి చెప్పిందని ఆయన విశ్లేషించారు. అభివృద్ధి అజెండాకే ప్రజలు పట్టం కడతారనడానికి ఈ విజయమే నిదర్శనమని స్పష్టం చేశారు.

ఈ చారిత్రక విజయం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్‌లకు చంద్రబాబు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. అదేవిధంగా, ఎన్డీయే తరఫున విజయం సాధిస్తున్నఅభ్యర్థులకు, అహర్నిశలు శ్రమించిన కార్యకర్తలకు, చారిత్రక తీర్పునిచ్చిన దేశ ప్రజలందరికీ ఆయన తన శుభాకాంక్షలు తెలియజేశారు.

Chandrababu Naidu
AP CM
Andhra Pradesh
Election Results 2024
NDA Victory
Narendra Modi
Amit Shah
BJP
Assam
Bengal

More Telugu News